KTR: తల్లిదండ్రులతో కలిసి కేటీఆర్ ను కలిసిన ఆలిండియా 'నీట్' ర్యాంకర్... అభినందించిన మంత్రి

  • ఇటీవలే నీట్ ఫలితాలు వెల్లడి
  • 3వ ర్యాంకు సాధించిన స్నికితారెడ్డి
  • ఆశీస్సులు అందించిన కేటీఆర్
KTR compliments NEET ranker Snikitha Reddy

ఇటీవలే నీట్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. వరంగల్ కు చెందిన స్నికితారెడ్డి నీట్ లో ఆలిండియా స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా స్నికితారెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ ప్రగతిభవన్ కు వచ్చి, మంత్రి కేటీఆర్ ను కలిసి ఆయన ఆశీస్సులు అందుకుంది. నీట్ లో అద్భుత ప్రతిభ కనబరిచావంటూ స్నికితారెడ్డిని కేటీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.

రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే హైదరాబాద్ తర్వాత వరంగల్ గొప్ప విద్యా కేంద్రంగా పేరుతెచ్చుకుంటోందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో తెలంగాణలో మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. అత్యున్నత సర్వీసు ఐఏఎస్ సహా నీట్, కామర్స్, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో తెలంగాణ యువత సత్తా చాటుతోందని పేర్కొన్నారు.

కాగా, వరంగల్ కు చెందిన స్నికితా రెడ్డి తల్లిదండ్రులిద్దరూ ప్రముఖ వైద్యులే. ఆమె తండ్రి డాక్టర్ సదానందరెడ్డి కార్డియాలజిస్టు కాగా, తల్లి డాక్టర్ లక్ష్మి గైనకాలజిస్టు. మంత్రి కేటీఆర్... స్నికిత తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు.

More Telugu News