చెన్నై సూపర్ కింగ్స్ కు మరో దెబ్బ... ఐపీఎల్ నుంచి బ్రావో ఔట్

21-10-2020 Wed 17:16
  • గాయంతో బాధపడుతున్న బ్రావో
  • బ్రావో ఈ సీజన్ కు దూరమవుతున్నాడన్న చెన్నై సీఈవో
  • పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నై
Injured all rounder Dwayne Bravo missed ongoing IPL season

ఈసారి ఐపీఎల్ లో అత్యంత చెత్తగా ఆడుతున్న టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. మొన్నటిదాకా ఓటమిబాటలో పయనించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కూడా పోరాటపటిమ చూపుతూ పాయింట్ల పట్టికలో పైపైకి ఎగబాకుతుంటే, ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడా జట్టుకు మరో దెబ్బ తగిలింది. కీలక ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి తప్పుకున్నాడు.

గత కొన్నిరోజులుగా గాయంతో బాధపడుతున్న బ్రావో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఈ మేరకు చెన్నై జట్టు సీఈవో విశ్వనాథన్ ఓ ప్రకటన చేశారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ఎంతో ఉపయుక్తంగా ఉండే బ్రావో గైర్హాజరీ ధోనీ సేనకు తీరనిలోటు. తాజా ఐపీఎల్ సీజన్ లో 10 మ్యాచ్ లు ఆడిన చెన్నై 7 మ్యాచ్ లలో ఓటమిపాలైంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇక లేనట్టే! ఈ నేపథ్యంలో పరువు దక్కించుకోవాలని భావిస్తున్నా,  బ్రావో వంటి ఆటగాళ్ల అండ లేకపోవడంతో అదీ కష్టమేననిపిస్తోంది.

ఐపీఎల్ లో చెన్నై జట్టు ఎంతో బలమైన జట్టుగా పేరుపొందింది. ఆడిన ప్రతి సీజన్ లో ప్లే ఆఫ్ దశకు చేరిన జట్టుగా ఇప్పటివరకు ఉన్న రికార్డు పేలవ ఆటతీరు కారణంగా మసకబారింది. ధోనీలో మునుపటి ఉత్సాహం, ఫిట్ నెస్ లేకపోవడం, ఇప్పటికీ ఫామ్ కోసం తంటాలు పడుతుండడం, జట్టులో ఎక్కువమంది వయసు పైబడుతున్న ఆటగాళ్లే కావడం... చెన్నై సూపర్ కింగ్స్ దారుణ పరిస్థితికి కారణమని క్రీడా పండితుల అభిప్రాయం.