ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో రాయితీలు ఉంటాయనే అక్కడ వాహనాలు కొనుగోలు చేశాం: జేసీ ప్రభాకర్ రెడ్డి

21-10-2020 Wed 15:46
  • అన్యాయంగా కేసులు పెడుతున్నారన్న జేసీ
  • అధికార పార్టీకో న్యాయం, మాకో న్యాయమా అంటూ ఆక్రోశం
  • ఇప్పుడు కూడా అరెస్ట్ చేస్తారేమోనంటూ వ్యంగ్యం
JC Prabhakar Reddy explains why the bought vehicles in Nagaland and Mijoram

ఇటీవల కాలంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ కావడం, బెయిల్ పై బయటికి రావడం పరిపాటిగా మారింది. ఈ పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి ఓ న్యాయం, తమకో న్యాయమా అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఏంచేయకపోయినా కేసులు పెట్టి లోపల వేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో రాయితీలు ఉంటాయి కాబట్టే తాము మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేస్తున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.

అక్కడ ఐటీ పన్ను ఉండదని, ఎన్నో మినహాయింపులు లభిస్తాయని చెప్పారు. ఏపీలో స్లీపర్ బస్సుల్లో 30 సీట్లకే అనుమతి ఉంటుందని, కానీ ప్రత్యేక హోదా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో 36 సీట్ల వరకు అనుమతి ఇస్తారు కాబట్టే తాము అక్కడ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నామని, దానికే దొంగలు, దొంగలు అని అరుస్తారు ఎందుకు? అని అసహనం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ చట్టాలకు లోబడి తాము కొనుగోళ్లు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయని, 28 శాతం జీఎస్టీ చెల్లించి వాహనాలు కొనుగోలు చేశామని వివరించారు. ఇప్పుడు తాను ప్రెస్ మీట్ పెట్టినందుకు కూడా అరెస్ట్ చేస్తారేమోనని జేసీ వ్యంగ్యంగా అన్నారు.