హరీశ్ రావుకు ఆ మాత్రం స్పష్టత లేకపోవడం సిగ్గుచేటు: డీకే అరుణ

21-10-2020 Wed 14:38
  • కేంద్ర నిధులపై కేసీఆర్ తో చర్చకు బండి సంజయ్ సిద్ధం
  • హరీశ్ తన పేరును అరిచేరావుగా మార్చుకోవాలి
  • హరీశ్ కు ఓటమి భయం పట్టుకుంది
DK Aruna challenges Harish Rao

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు స్పష్టత లేకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. మీడియా ముందుకు వచ్చి అరవడం తప్ప ఆయన చేసేదేమీ లేదని అన్నారు. హరీశ్ రావు తన పేరును అరిచేరావుగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్చకు వస్తారని... దానికి కేసీఆర్ సిద్ధమేనా? అని హరీశ్ కు సవాల్ విసిరారు. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి భయంతో ఓటర్లను హరీశ్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు, అధికార బలంతో ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని చెప్పారు.