అధికారులే ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసే పరిస్థితి ఉంటే ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోతుంది: ఐవైఆర్

21-10-2020 Wed 14:02
  • అర్చకులకు జగన్ మేలు చేద్దామనుకుంటున్నారన్న ఐవైఆర్
  • దేవాదాయ శాఖ అధికారులు అడ్డుతగులుతున్నారని వెల్లడి
  • కారణాలు వెతకాల్సిన అవసరం ఉందని సూచన
 IYR comments on AP Government administration

అర్చకుల హక్కుల విషయంలో సీఎం జగన్ ఉదారంగా వ్యవహరించినా, సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు పడనివ్వడంలేదని మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు.

"దేవుడు వరం ఇద్దాం అనుకున్నా గానీ పూజారి ఇవ్వనివ్వడంలేదు అనేది తెలుగు సామెత. ముఖ్యమంత్రి గారు ఇద్దాం అనుకుంటున్నా దేవాదాయ శాఖ అధికారులు ఇవ్వనివ్వడంలేదన్నది నేటి విషయం. చట్టానికి సవరణ వచ్చింది 2007లో. నాటి సవరణలకు అనుగుణంగా 2015లో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రతిపాదించారు.

కారణాలు ఏవైనా ఆ ఉత్తర్వులను ఈ ప్రభుత్వం తొక్కిపెట్టి ఉంచడం జరిగింది. ఈ ప్రభుత్వం గత సంవత్సరం అక్టోబరు 22న ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది దాకా ఆ ఉత్తర్వులు అమలు జరగలేదంటే కారణం వెతకాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒక శాఖలోని అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసే పరిస్థితి ఉంటే ప్రభుత్వ నిర్వహణ సజావుగా సాగుతుందన్న అభిప్రాయం ప్రజల్లో కలగదు" అని ఐవైఆర్ వ్యాఖ్యలు చేశారు.