రివర్స్ అయిన బ్రహ్మాజీ ‘బోటు' ట్వీట్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న సినీ నటుడు!

21-10-2020 Wed 13:36
  • ఓ మోటారు బోటు కొనాలనుకుంటున్నానంటూ ఇటీవల ట్వీట్
  • దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండని సెటైర్
  • మండిపడ్డ నెటిజన్లు
  • ప్రజలు బాధపడుతుంటే ఇలాంటి ట్వీటా అంటూ తీవ్ర విమర్శలు 
BRAHMAJI  Planning to buy a motor boat suggestions pl tweet viral

హైదరాబాద్‌లోని వర్ష బీభత్స పరిస్థితులపై సినీనటుడు బ్రహ్మాజీ తనదైన శైలిలో సరదాగా చేసిన ట్వీటు ఆయన కొంపముంచింది. నెటిజన్ల నుంచి వస్తోన్న విమర్శల బారికి ఆయన ట్విట్టర్ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన ఖాతా సెర్చ్ చేస్తే ఈ ఖాతా ఇప్పుడు యాక్టివ్ గా లేదని కనపడుతోంది.

‘ఓ మోటారు బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి తెలపండి’ అని బ్రహ్మాజీ ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. #HyderabadFloods అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఆయన తగిలించాడు. ఆయనకు సలహాలు ఇస్తూ నెటిజన్లు కూడా సెటైర్లు వేశారు. అయితే, ఆయన చేసిన ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.

హైదరాబాద్‌ ప్రజలను కుండపోత వర్షాలు నానా ఇబ్బందులకు గురిచేస్తోన్న నేపథ్యంలో ఆయన ఇటువంటి జోకులు వేయడం ఏంటని పెద్ద ఎత్తున తెలంగాణ వాసులు విమర్శలు గుప్పిస్తూ పోస్టులు చేశారు. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో ఉండి ప్రజలకు నిత్యావసరాలు కూడా దొరకకపోతుంటే బ్రహ్మాజీకి ఈ పరిస్థితులు నవ్వులాటగా ఉన్నాయా? అంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలోనే  తన ట్విట్టర్‌ ఖాతాని ఆయన డియాక్టివేట్‌ చేసినట్లు తెలిసింది.