ఏపీలో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభం... 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి

21-10-2020 Wed 13:25
  • క్యాంపు కార్యాలయంలో పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
  • కేంద్రం వాటాను కూడా తామే చెల్లిస్తున్నట్టు వివరణ
  • జాబితాలో పేర్లు లేనివాళ్లు నమోదు చేయించుకోవాలని సూచన
CM Jagan launches YSR Beema scheme in AP

రాష్ట్రంలో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభమైంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 1.41 కోట్ల కుటుంబాలు వైఎస్సార్ బీమా పథకం పరిధిలోకి వస్తాయని తెలిపారు. బీమా పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా తప్పుకుందని, ఆ ప్రీమియంను కూడా తామే చెల్లించేందుకు సిద్ధమయ్యామని వివరించారు.

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి ఈ పథకం ద్వారా ఉచిత బీమా సదుపాయం అందుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీమా పథకం వివరాలను కూడా సీఎం జగన్ వివరించారు. 18 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నవారు మరణిస్తే ఈ పథకం ద్వారా రూ.5 లక్షలు లభిస్తాయని తెలిపారు. 51 నుంచి 70 ఏళ్ల వయసు వారు మరణిస్తే రూ.3 లక్షలు ఇస్తారని అన్నారు.

సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదాల్లో పాక్షిక వైకల్యం పాలైతే రూ.1.50 లక్షలు లభిస్తాయని చెప్పారు. ఒకవేళ తమ పేర్లు జాబితాలో లేకపోతే గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా నమోదు చేయించుకోవాలని సీఎం జగన్ సూచించారు.