హీరో విజయ్ సేతుపతి చిన్న కూతురికి అత్యాచార బెదిరింపులపై ఖుష్బూ ఆగ్రహం!

21-10-2020 Wed 13:18
  • విజయ్ సేతుపతి ధైర్యవంతుడు
  • ఆయన ఎప్పటిలాగానే ఉండాలి
  • కొందరు బెదిరింపులకు పాల్పడటం ఓ అనాగరిక చర్య 
  • నిందితుడిని త్వరలోనే కనిపెట్టి, కఠిన శిక్ష విధిస్తారు
khushboo fires On netizen

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ పేరిట ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తుండగా, తమిళుల నుంచి తీవ్ర విమర్శలు రావడం, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ ఆయనకు మురళీధరన్ విజ్ఞప్తి చేయడంతో దీంతో ఇప్పటికే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

తమిళులను ఊచకోత కోసిన శ్రీలంక ప్రభుత్వాన్ని మురళీధరన్ అప్పట్లో సమర్థించాడని, ఆయన వ్యక్తి పాత్రలో నటించడం సరికాదని తమిళులు అన్నారు. ఈ సినిమా నుంచి తప్పుకున్న అనంతరం కూడా  విజయ్ సేతుపతి చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో అత్యాచార బెదింపులు రావడం కలకలం రేపింది.

దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ అలాంటి హెచ్చరికలు చేస్తున్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా దీనిపై స్పందస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ సేతుపతి ధైర్యవంతుడని, ఆయన ఎప్పటిలాగానే ఉండాలని సూచించారు.  

ఆయన కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడటం ఓ అనాగరిక చర్య అని ఆమె అన్నారు. అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆమె చెప్పారు. నిందితుడిని త్వరలోనే కనిపెట్టి, కఠిన శిక్ష విధిస్తారని తెలిపారు. ఆ‌ బయోపిక్‌ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకోవడానికి పెద్ద మనస్సుండాలని, ఆ పని విజయ్ సేతుపతి చేశారని కొనియాడారు. ఆయనకు బాసటగా నిలుస్తామని చెప్పారు.