కరోనాపై పోరులో విఫలమైనా... నరేంద్ర మోదీపై తగ్గని ప్రజాభిమానం!

21-10-2020 Wed 11:46
  • కరోనా కేసుల విషయంలో టాప్-2లో భారత్
  • మోదీ సక్రమంగానే పనిచేస్తున్నారు
  • ప్రజలకు మేలు చేయడమే ఆయన ఉద్దేశం
  • బీహార్ ఎన్నికల ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైన అభిప్రాయం
No Fall in PM Modi Popularity after Corona Also

భారతావని ఇప్పుడు కరోనా మహమ్మారిపై తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. కేసుల సంఖ్య విషయంలో ఇప్పుడు మనం టాప్-2లో, మరణాల విషయంలో టాప్-5లో ఉన్నాం. ప్రస్తుత మానవాళి కనీవినీ ఎరుగని ఆరోగ్య సంక్షోభం నెలకొన్న వేళ, దేశీయంగా సతమతమవుతున్న ఇండియా ముందు, చైనా రూపంలో సరిహద్దుల్లో మరో ప్రమాదం ముంచుకొస్తోంది. అయినప్పటికీ, భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో అభిమానం తగ్గలేదు. పరిస్థితులను ఆయన నాయకత్వం చక్కదిద్దుతుందనే అత్యధికులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బీహార్ లో కూడా ప్రజలు ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారని ఒపీనియన్ పోల్స్ తేల్చి చెప్పాయి. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 మధ్య బీహార్ లో ఎన్నికలు జరుగనుండగా, ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 78 శాతం మంది ప్రజలు మోదీ అద్భుతంగా లేదా చక్కగా పనిచేస్తున్నారని అభిప్రాయపడటం గమనార్హం.

ఇక మోదీ పాలన సంతృప్తికరంగా ఉందని చెప్పిన వారిలో పలువురు లాక్ డౌన్ లో తీవ్ర ఇబ్బందులు పడిన వారు కూడా ఉండటం గమనార్హం. ఉదాహరణకు 22 సంవత్సరాల సంజయ్ కుమార్... ఏప్రిల్ లో లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడంటూ, నడిరోడ్డుపై పోలీసులతో చావు దెబ్బలు తిన్న వ్యక్తి. దేశ రాజధానిలో పూట గడవక, సైకిల్ పై బీహార్ లోని తన గ్రామానికి బయలుదేరిన సంజయ్ ని మార్గమధ్యంలో పోలీసులు నిలువరించి కొట్టారు. ఆపై దాదాపు 1000 కిలోమీటర్లు అదే సైకిల్ పై ప్రయాణించి తన ఊరికి చేరుకున్నాడు.

ఈ సర్వేలో తన అభిప్రాయాలను పేర్కొన్న సంజయ్, ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ఇచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు, మధ్యవర్తుల కారణంగా చాలా మందికి అందలేదని, అయితే, మోదీ తప్పు ఇందులో ఏమీ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. మోదీ మంచి చేయాలన్న తపనతో ఉన్నారని, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ప్రజలకు సాధ్యమైనంత మేలు చేయాలన్నదే ఆయన ఆలోచనని వ్యాఖ్యానించాడు.

మోదీకి మద్దతుదారులుగా ఉన్న లక్షలాది మంది కూడా ఇదే అభిప్రాయంతో వున్నారు. బీహార్ లోని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, గ్రామాల నేతలతో పాటు ఎంతో మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కూడా, ప్రధానిగా మోదీ విఫలం కావడం లేదని భావిస్తున్నట్టు వెల్లడించడం గమనార్హం. ఇదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షం బలహీనంగా ఉండటం కూడా మోదీ బలం పడిపోకుండా చూస్తోందని అభిప్రాయపడ్డ వారూ లేకపోలేదు.