పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను ప్రప్రథమంగా అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: మంత్రి ఆళ్ల నాని

21-10-2020 Wed 11:36
  • కానిస్టేబుల్ నుంచి ఇన్స్ పెక్టర్ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ 
  • మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశాం
  • నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం
AP is the first state to give weekly offs to police says Alla Nani

దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ను అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని ఏపీ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్ పెక్టర్ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ ను ప్రప్రథమంగా అమలు చేసిన రాష్ట్రం ఏపీ అని చెప్పారు. మహిళల కోసం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ  సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని ఆళ్ల నాని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ ను తీసుకొచ్చామని ఆళ్ల నాని చెప్పారు. రాష్ట్రంలో నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని... నేరాల సంఖ్య 18 శాతం తగ్గిందని అన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.