England: బ్రిటన్ ప్రధాని బోరిస్ కు వేతనం సరిపోవడం లేదట.. పదవి నుంచి దిగిపోవాలని యోచన!

Boris johnson want to leave prime minister post
  • బ్రిటన్‌కు చెందిన డైలీ మిర్రర్ కథనం
  • ప్రస్తుతం ఆయన వార్షిక వేతనం 1,50,400 పౌండ్లు  
  • కనీస అవసరాలు కూడా తీరడం లేదని ఆవేదన
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు వచ్చే వేతనంపై ఏమాత్రం సంతృప్తిగా లేరట. అందుకని మరో ఆరు నెలలలో పదవిని వదిలేసుకోవాలని యోచిస్తున్నారట. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ‘డైలీ మిర్రర్’ ఓ కథనాన్ని ప్రచురించింది. బోరిస్ గతంలో టెలిగ్రాఫ్ పత్రికలో కాలమిస్టుగా పనిచేసేవారు. అప్పట్లో ఆయనకు ఏడాదికి 2.75 లక్షల పౌండ్లు వచ్చేవి. దీంతోపాటు నెలకు రెండుసార్లు ప్రసంగాలు ఇవ్వడం ద్వారా మరో 1.6 లక్షల పౌండ్లు సంపాదించేవారు. ప్రధాని అయిన తర్వాత ఆయనకు వచ్చే వార్షిక వేతనం 1,50,400 పౌండ్లకు పరిమితమైంది.

ఈ వేతనంతో జీవించడం కష్టంగా మారిందట. కనీస అవసరాలు కూడా తీరడం లేదని బోరిస్ ఆవేదన వ్యక్తం చేసినట్టు కథనం తెలిపింది. వచ్చే జీతంతో తనకున్న ఆరుగురు పిల్లల్ని పోషించుకోవడంతోపాటు విడాకులు ఇచ్చిన భార్యకు కొంత భరణం కూడా చెల్లించాలి. దీంతో వస్తున్న జీతం ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రధాని వాపోతున్నారట. ప్రస్తుతం బోరిస్ ఇంట్లో హౌస్ కీపర్ కూడా లేడని, ఇల్లంతా చిందరవందరగా ఉందని బోరిస్ సన్నిహితులు చెప్పినట్టు డైలీ మిర్రర్ తెలిపింది. బోరిస్‌కు ముందు ప్రధానిగా ఉన్న థెరిసా మే ఇప్పుడు ప్రసంగాలిస్తూ సుమారు 10 లక్షల పౌండ్ల వరకు వెనకేశారని పత్రిక తన కథనంలో పేర్కొంది.
England
Britian
Boris Johnson
Salary

More Telugu News