ఢిల్లీని ఓడించిన పంజాబ్.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

21-10-2020 Wed 06:36
  • శిఖర్ ధవన్ సెంచరీ వృథా
  • అర్ధ సెంచరీతో జట్టును విజయం ముంగిట నిలిపిన పూరన్
  • పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకిన పంజాబ్
Punjab defeated Delhi

ఐపీఎల్ ప్రారంభంలో వరుస పరాజయాలతో అట్టడుగున నిలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గత రాత్రి భీకర ఫామ్‌లో ఉన్న ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 166 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు మైదానంలో అడుగుపెట్టిన పంజాబ్ 17 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (15) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ 29 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగులో బౌల్డయ్యాడు. అయితే, అతడు క్రీజులో ఉన్న కాసేపు ఢిల్లీకి చేయాల్సిన నష్టాన్ని చేసేశాడు. 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులు చేసి రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు.ఆ తర్వాత మరో 4 పరుగులకే మయాంక్ అగర్వాల్ (5) సమన్వయ లేమితో రనౌట్ అయ్యాడు.

 అనంతరం క్రీజులోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేయడంతో పంజాబ్ విజయానికి చేరువైంది. ఆ వెంటనే పూరన్ అవుటైనా మ్యాక్స్‌వెల్ 32 (24 బంతుల్లో 3 ఫోర్లతో) పరుగులు చేయడంతో జట్టు విజయం ముంగిట నిలిచింది. దీపక్ హుడా 14, నీషమ్ 10 పరుగులు చేశారు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ విజయం సాధించింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ధవన్‌కు ఇది రెండో శతకం. ఢిల్లీ జట్టులో ధవన్ తప్ప మరెవరూ పట్టుమని 20 పరుగులు కూడా చేయలేకపోయారు. పృథ్వీషా (7), శ్రేయాస్ అయ్యర్ (14), పంత్ (14), స్టోయినిస్ (9), హెట్‌మయర్ (10) చేశారు. సెంచరీతో అదరగొట్టిన ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.