'రాధే శ్యామ్'కు సంగీత దర్శకుడు ఖరారు

20-10-2020 Tue 21:03
  • టాలీవుడ్ భారీ చిత్రాలలో 'రాధే శ్యామ్' ఒకటి
  • గత కొన్ని రోజులుగా ఇటలీలో షూటింగ్
  • ప్రభాస్, పూజ హెగ్డేలపై సన్నివేశాల చిత్రీకరణ
  • సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్ ఎంపిక    
Music director for Radhe Shyam confirmed

ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణంలో వున్న భారీ బడ్జెట్ చిత్రాలలో 'రాధే శ్యామ్' ఒకటి. ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం జార్జియాలో జరిగింది.

ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ గత కొన్ని రోజులుగా ఇటలీలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ హీరో హీరోయిన్లు ప్రభాస్, పూజ హెగ్డే, మరికొందరిపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే, అక్కడ హీరో హీరోయిన్లపై కొన్ని పాటలను చిత్రీకరించడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ అక్కడ మరికొన్నాళ్ల పాటు కొనసాగుతుంది.

ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తాజాగా జస్టిన్ ప్రభాకరన్ ను ఎంచుకున్నారు. తమిళ సంగీత దర్శకుడైన ప్రభాకరన్ ఆమధ్య తెలుగులో 'డియర్ కామ్రేడ్' సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు 'రాధే శ్యామ్' సినిమా అతనికి తెలుగులో మంచి బ్రేక్ అవుతుందనే చెప్పచ్చు!