ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా మా డాక్టర్లు కేన్సర్ రోగికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు: బాలకృష్ణ

20-10-2020 Tue 19:54
  • రొమ్ము క్యాన్సర్ తో ఓ యువతి బసవతారకంకు వచ్చింది
  • ఆమెకు ఉచితంగానే వైద్యం చేశాము
  • కరోనా వచ్చిన వారికి కూడా ఇక్కడ వైద్యం చేస్తాం
Our doctors successfully done operation for a critical patient says Balakrishna

రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ యువతికి హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ ను పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ ను ఉచితంగా నిర్వహించారు. ఆపరేషన్ సక్సెస్ అయిన నేపథ్యంలో, ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ సదరు యువతిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైద్యో నారాయణో హరి అనే మాటను బసవతారకం వైద్యులు నిరూపించారని ప్రశంసించారు. కరోనా వచ్చిన వారికి కూడా బసవతారకంలో వైద్యం అందిస్తామని చెప్పారు.

ఆపరేషన్ జరిగిన యువతి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ, రొమ్ముకు కుడివైపున భారీ కణితితో శ్రీకాళహస్తికి చెందిన యువతి బసవతారకం ఆసుపత్రికి వచ్చిందని చెప్పారు. ఆమె వచ్చే సమయానికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని... ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని తమ డాక్టర్లు  చెప్పారని... వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని తాను చెప్పానని తెలిపారు. నాన్నగారి ఆశయాల మేరకు ఆమెకు ఉచితంగానే ఆపరేషన్ చేశామని చెప్పారు.

ఆమెకు ఆపరేషన్ నిర్వహించేందుకు తొలుత అంతా రెడీ చేశాక... ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని బాలయ్య తెలిపారు. దీంతో, ఆమెను మూడు వారాలు ఐసొలేషన్ లో ఉంచామని... ఆ మూడు వారాల కాలంలో ఆమెకున్న కణితి కుళ్లిపోయిందని చెప్పారు. దీంతో, ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తమ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బసవతారకం ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నామని... కరోనా వచ్చిన వారికి కూడా ఇక్కడ వైద్యం చేస్తామని చెప్పారు.