మళ్లీ షూటింగులో రకుల్.. వర్షంలో చిత్రీకరణ!

20-10-2020 Tue 16:48
  • ఇటీవల ఎన్సీబీ విచారణకు హాజరైన రకుల్
  • అప్పటి నుంచీ ముంబైలో ఇంట్లోనే
  • నిన్న క్రిష్ సినిమా షూటింగులో చేరిక
  • ప్రస్తుతం రైనీ సన్నివేశాల చిత్రీకరణ    
Rakul Preeth Sing joins shoot again

ఇటీవలి కాలంలో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ బాగా అప్సెట్ అయిన విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే, పెద్ద ఇబ్బందిలోనే పడింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హత్య కేసు విషయంలో డ్రగ్స్ కోణం బయటపడ్డాక, రకుల్ పేరు కూడా బయటకు రావడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. పైగా, నార్కోటిక్స్ బ్యూరో అధికారులు విచారణకు పిలవడంతో ఆమె బాగా అప్సెట్ అయింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు షూటింగులకు వెళ్లలేక, ముంబైలోనే ఉండిపోయింది.

ఈ క్రమంలో ఆమె మళ్లీ ఇప్పుడు షూటింగులలో పాల్గొనడానికి నిన్న హైదరాబాదుకు చేరుకుంది. వచ్చి రావడంతోనే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగులో రకుల్ పాల్గొంది. హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో ఈ షూటింగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వర్షంలో కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని రకుల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. కరోనానే కాకుండా హైదరాబాద్ వర్షాలను సైతం తట్టుకుని తాము ప్రస్తుతం రైనీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని రకుల్ పేర్కొంది. 'ఏది ఏమైనా పని మాత్రం ఆగదు..' అంటూ పోస్ట్ పెట్టింది. కాగా, ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. ఇందులో రకుల్ గిరిజన యువతిగా కనిపిస్తుందట!