ఈ జలప్రళయం ముగిసేంతవరకు హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు

20-10-2020 Tue 14:56
  • భాగ్యనగరంపై వరుణుడి పంజా
  • ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలన్న చంద్రబాబు
  • సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ టీడీపీ శ్రేణులకు నిర్దేశం
Chandrababu urged people of Hyderabad please stay at home until this deluge is over

హైదరాబాద్ నగరాన్ని గత కొన్నిరోజులుగా ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు ఇంకా శాంతించలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న నేపథ్యంలో భాగ్యనగరానికి మరికొన్ని రోజుల పాటు వర్షసూచన వెలువడింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ జలప్రళయం ముగిసేంతవరకు హైదరాబాద్ ప్రజలు ఇళ్ల వద్దనే ఉండడం ద్వారా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. పౌరులందరూ స్వీయరక్షణతో పాటు కుటుంబాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

"మీ అందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ సేవలు అవసరమైనా ముందుండాలని, సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని టీడీపీ నాయకులను, కార్యకర్తలను కోరుతున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.