NGT: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీ కీలక తీర్పు... వివరాలు ఇవిగో!

  • పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు జరిగాయన్న ఎన్జీటీ
  • ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాలని వెల్లడి
  • కమిటీ ఏర్పాటు చేయాలంటూ పర్యావరణ శాఖకు ఆదేశాలు
  • నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ
National Green Tribunal verdict on Kaleswaram project

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయని ఎన్జీటీ స్పష్టం చేసింది. పర్యావరణ ప్రభావంపై మదింపు లేకుండానే ప్రాజెక్టు చేపట్టారని తెలిపింది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడేలా నిర్మించారని తన తీర్పులో వెల్లడించింది.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్ర పర్యావరణ శాఖ విఫలమైందని ఎన్జీటీ ఆరోపించింది. ప్రాజెక్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ పర్యావరణ హితాన్ని విస్మరించలేమని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ మేరకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది.

2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతులు లేకుండా చేసిన నిర్మాణం వల్ల ఎంతమేర పర్యావరణ నష్టం జరిగిందో అంచనా వేసి, ఆ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ తెలిపింది. నెల రోజుల్లో కమిటీ ఏర్పాటు చేసి, మరో నెల రోజుల్లో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని సూచించింది.

కమిటీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి అప్పగించింది. ప్రాజెక్టు విస్తరణపై స్పందిస్తూ... ఇటీవల అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్న విధంగా డీపీఆర్ లు సమర్పించాక కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, ఆ తర్వాతే విస్తరణకు ఉపక్రమించవచ్చని వివరించింది.

More Telugu News