చెన్నైలో కుమరన్ సిల్క్స్ కు పోటెత్తిన జనం.... దుకాణం సీల్ చేసిన అధికారులు

20-10-2020 Tue 13:34
  • పండుగ సీజన్ లో షాపింగ్ కు ఉత్సాహం చూపుతున్న జనాలు
  • కిటకిటలాడిన చెన్నై కుమరన్ సిల్క్స్
  • భౌతికదూరం పాటించకుండా షాపింగ్
  • చర్యలు తీసుకున్న చెన్నై కార్పొరేషన్ అధికారులు
Chennai corporation officials sealed Kumaran Silks

ఇది పండుగల సీజన్. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమయంలో ఎంతో హడావుడి కనిపిస్తుంది. ఈ క్రమంలో చెన్నైలోని కుమరన్ సిల్క్స్ వస్త్ర దుకాణానికి జనం విరగబడ్డారు. కరోనా మహమ్మారి పొంచి ఉన్న తరుణంలోనూ లెక్కచేయకుండా షాపింగ్ చేసేందుకు భారీగా తరలివచ్చారు. చెన్నై త్యాగరాయనగర్ లో ఉన్న ఈ ప్రముఖ వస్త్రదుకాణం లోపల తిరునాళ్ల వాతావరణం కనిపించింది.

భౌతికదూరం సంగతి అటుంచితే కొందరు ముఖాలకు మాస్కులు కూడా లేకుండా వచ్చారు. ఈ సమాచారం అందుకున్న చెన్నై కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలడంతో కుమరన్ సిల్క్స్ దుకాణానికి సీల్ వేశారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.