Hyderabad: బంగాళాఖాతంలో అల్పపీడనం... హైదరాబాదులో మళ్లీ వర్షం

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపానుల సీజన్
  • ఈ ఉదయం మరో అల్పపీడనం
  • అల్పపీడనానికి తోడైన ఉపరితల ఆవర్తనం
Heavy rain lashes once again in Hyderabad

బంగాళాఖాతంలో ఇది తుపానుల సీజన్ కావడంతో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వీటికి ఉపరిత ఆవర్తనాలు తోడవడంతో పలు ప్రాంతాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. గత కొన్నిరోజులుగా నగరాన్ని వీడని భారీ వర్షాలు ఈ మధ్యాహ్నం కూడా పలకరించాయి. బంగాళాఖాతంలో ఈ ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ విభాగం వెల్లడించింది.

దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, కుషాయిగూడ, మల్కాజ్ గిరి, తార్నాక, ఓయూ క్యాంపస్, సైనిక్ పురి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గోల్కొండ, చాంద్రాయణగుట్ట, కాప్రా, ఫలక్ నుమా, చార్మినార్, మెహదీపట్నం, అంబర్ పేట్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నగరంలో పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగా కారుమబ్బులు కమ్ముకోవడంతో హైదరాబాద్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే వరదలతో భీతిల్లిన ప్రజలు, చినుకురాలితే చాలు హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరోసారి భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావద్దని హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ చెబుతున్నారు.

More Telugu News