విజయ్‌ సేతుపతి చిన్న కూతురిని అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు!

20-10-2020 Tue 12:52
  • ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా సినిమా
  • ‘800’ సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి
  • ఆయన కుమార్తెను అత్యాచారం చేస్తామనడంపై చిన్మయి మండిపాటు
vijay setupati daughter gets rape threats

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా ‘800’ పేరిట ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా మోషన్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసిన నేపథ్యంలో అచ్చం మురళీధరన్ ‌లా, శ్రీలంక జెండా ఉన్న జెర్సీతో విజయ్ కనపడిన తీరుపై తమిళుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

తమిళులను ఊచకోత కోసిన శ్రీలంక ప్రభుత్వాన్ని మురళీధరన్ అప్పట్లో సమర్థించాడనీ, అలాంటి వ్యక్తి పాత్రలో, ఆ దేశ జాతీయ చిహ్నం ఉన్న జెర్సీతో విజయ్ నటిస్తున్నాడని వారు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి  మురళీధరన్ విజ్ఞప్తి చేశారు.   దీంతో ఇప్పటికే విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.  

ఈ ప్రాజెక్టు నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్న నేపథ్యంలో ఆయన చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో కొందరు అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. ఆయన కూతురిపై  అఘాయిత్యానికి పాల్పడతామని, తాము అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో ఆ నటుడికి అర్థం అవుతుందని ఓ నెటిజన్ అన్నాడు. దీనిపై పలువురు స్పందిస్తూ అలాంటి హెచ్చరికలు చేస్తున్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగర్‌ చిన్మయి కూడా స్పందిస్తూ.. ట్రోల్‌ చేసిన అకౌంట్‌ను పోలీసులకు ట్వీట్ చేశారు. ఓ నెటిజన్‌ వ్యాఖ్యలపై మండిపడుతూ దానికి చెందిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు. ఇటువంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారని, దీనిని ఎవరూ మార్చలేరని ఆమె అన్నారు.

అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెప్తున్న వ్యక్తి నేరస్థుడని, సమాజంలో ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్రికెటర్ ధోనీ కూతురు జీవాకు కూడా ఇటీవల ఇటువంటి బెదిరింపులే వస్తే, సోషల్ మీడియాలో అటువంటి పోస్టు చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన గురించి మరవకముందే మళ్లీ అటువంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.