బాలీవుడ్ లో 'సర్కస్' చేస్తున్న పూజ హెగ్డే!

20-10-2020 Tue 12:01
  • తెలుగుతో పాటు హిందీ సినిమాలలో పూజ
  • సల్మాన్ తో పూజ 'కభీ ఈద్ కభీ దివాలి'
  • రణ్ వీర్ హీరోగా రోహిత్ శెట్టి 'సర్కస్'
  • వచ్చే నెల నుంచి షూటింగ్ నిర్వహణ  
Pooja Hegde latest Hindi film Cirkus

పూజ హెగ్డే ఈవేళ తెలుగులో అగ్రస్థాయి కథానాయిక. ఆమధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం విజయంతో ఆమె ఇమేజ్ మరింత పెరిగిపోయింది. దాంతోపాటే ఆమె పారితోషికమూ పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'రాధే శ్యామ్' చిత్రాలలో నటిస్తూ బిజీగా వుంది.

మరోపక్క తన టార్గెట్ అయిన బాలీవుడ్ ని కూడా ఈ ముద్దుగుమ్మ విడిచిపెట్టలేదు. బాలీవుడ్ లో రాణించాలన్నది తన లక్ష్యం కాబట్టి అక్కడ కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో గతేడాది 'హౌస్ ఫుల్ 4' చిత్రంలో నటించింది. ఇప్పటికే సల్మాన్ తో 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమా చేస్తోంది. అలాగే తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. ఈ సినిమా పేరు 'సర్కస్'. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో మరో కథానాయికగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తోంది.

సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత షేక్స్ పియర్ రచించిన ప్రసిద్ధ నాటకం 'కామెడీ ఆఫ్ ఎర్రర్స్' ఆధారంగా ఇప్పుడీ 'సర్కస్' చిత్రాన్ని పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నారు. వచ్చే నెల నుంచి షూటింగును ప్రారంభిస్తారు. ముంబైతో పాటు, ఊటీ, గోవాలలో కూడా చిత్రీకరణ నిర్వహిస్తారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఎంతగానో పులకించిపోతున్నానని, ఈ సూపర్ టాలెంటెడ్ ద్వయంతో కలసి పనిచేస్తున్నందుకు ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నానని పూజ ట్వీట్ చేసింది.

ఇదిలావుంచితే, గతంలో రోహిత్ శెట్టి రూపొందించిన 'సింబా' సినిమాలో రణ్ వీర్ హీరోగా నటించాడు. అలాగే, అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ తాజాగా దర్శకత్వం వహించిన 'సూర్యవంశీ' సినిమాలో కూడా గెస్ట్ పాత్ర పోషించాడు.