జర్నలిస్టుపై మండిపడుతూ వరుసగా ట్వీట్లు చేసిన పీవీ సింధు

20-10-2020 Tue 11:50
  • లండన్‌కు వెళ్లిన సింధు
  • కుటుంబంలో గొడవలు అంటూ ఓ జర్నలిస్టు రాతలు
  • అసత్య ప్రచారం చేస్తున్నాడని సింధు ఆగ్రహం
  • రాతలు ఆపకపోతే చట్టబద్ధంగా పోరాడతానని హెచ్చరిక
PV Sindhu spreading false news should know the facts first before writing them If he doesnt stop

ఓ స్పోర్ట్స్ జర్నలిస్టుపై మండిపడుతూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుసగా ట్వీట్లు చేసింది. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంది. అయితే, ఆమె మొట్టమొదటి సారి తన తల్లిదండ్రులతో కాకుండా ఒక్కరే విదేశాలకు వెళ్లిందని ఓ జాతీయ మీడియా జర్నలిస్టు ఓ కథనం రాశాడు. మరో రెండు నెలలు ఆమె అక్కడే ఉంటుందని అందులో పేర్కొన్నాడు.

కుటుంబంలో సమస్యలు తలెత్తడం వల్లే ఆమె పది రోజుల క్రితం లండన్ వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ టీమ్ తో కలిసి ఆమె అక్కడే ప్రాక్టీసును మొదలు పెట్టనుందని, ఆమెను తిరిగి ఇంటికి రప్పించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నాడు.

ఈ కథనంపైనే పీవీ సింధు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిట్‌నెస్‌లో భాగంగా న్యూట్రిషన్ కోసం తాను కొన్ని రోజుల క్రితం లండన్‌కు వచ్చానని, నిజానికి తన తల్లిదండ్రుల అనుమతితోనే వచ్చానని ఆమె చెప్పింది. ఈ విషయంలో వారితో ఎటువంటి గొడవలూ లేవని వివరించింది.

‘నాకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులతో నాకు సమస్యలు, గొడవలు ఎందుకు ఉంటాయి? నా కుటుంబంతో నేను చాలా క్లోజ్ గా ఉంటాను.. వారు నన్ను ఎల్లప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ప్రతిరోజు నేను వారితో మాట్లాడుతూనే ఉన్నాను’ అని సింధు తెలిపింది.

‘అలాగే, నాకు నా కోచ్ పుల్లెల గోపిచంద్ తోనూ, ఆయన శిక్షణ సంస్థతోనూ ఎటువంటి సమస్యలు లేవు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ రిపోర్టర్ నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇటువంటి వార్తలు రాసేటప్పుడు నిజాలు ఏంటో తెలుసుకుని రాయాలి. అతడు ఇటువంటి చర్యలను మానుకోకపోతే నేను అతడిపై చట్టబద్ధంగా పోరాడతాను’ అని పీవీ సింధు హెచ్చరించింది.