నా భర్తను చంపేశారు.. హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన కీసర మాజీ తహసీల్దార్ భార్య

20-10-2020 Tue 10:44
  • నాతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు
  • జైలులోని సీసీటీవీ ఫుటేజీలో తన భర్తతో పాటు నలుగురు ఉన్నారన్న స్వప్న
  • వారే చంపేసి ఉంటారని అనుమానం
Keesara Ex MRO Nagaraju wife complaint to NHRC about her husband suicide

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు భార్య రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. మండలంలోని రాంపల్లి దయారా గ్రామంలోని 39 గుంటల భూమిని పట్టాదారులకు కట్టబెట్టేందుకు రూ. 2 కోట్లు డిమాండ్ చేసి, రూ. 1.10 కోట్లను లంచంగా తీసుకున్న తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి చిక్కి కటకటాలపాలైన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా చంచల్‌గూడ జైలులో ఉన్న నాగరాజు ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే, తన భర్తది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆయన భార్య స్వప్న నిన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. తన భర్త ఈ నెల 13న వీడియో కాల్ ద్వారా జైలు నుంచి తనతో మాట్లాడారని, అప్పుడు పూర్తి ఆరోగ్యంగా కనిపించారని అన్నారు. 14వ తేదీన జైలు అధికారులు తన సోదరుడికి ఫోన్ చేసి నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారని పేర్కొన్నారు.

తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురికీ తరలించారని చెప్పారు. 13, 14 తేదీల్లో జైలులో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీలో తన భర్తతో మరో నలుగురు వ్యక్తులు కనిపించారని, వారిపైనే తనకు అనుమానం ఉందన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందని స్వప్న ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, జైలర్, ఏసీబీ తీరుపై తనకు అనుమానంగా ఉందన్నారు.

తన భర్త మృతిపై ఫిర్యాదు చేసేందుకు డబీర్‌పుర పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, అక్కడ ఓ అధికారి తనతో చెప్పిన మాటలు షాక్‌కు గురిచేశాయన్నారు. నాగరాజు ఆత్మహత్య సాధారణ విషయం కాదని, ఓ సోదరుడిగా సలహా ఇస్తున్నానని చెప్పిన ఆయన మీ మంచి కోసమే చెబుతున్నాను, వినాలని కోరాడని స్వప్న వివరించారు.

పిల్లలు చిన్నవాళ్లని, అనవసరంగా విచారణ పేరుతో సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని ఆయన సూచించారని ఆమె చెప్పారు. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా, సాక్ష్యం లేకుండా తామేమీ చేయలేమని తేల్చి చెప్పారని, దీనిని బట్టి చూస్తుంటే తన భర్తది ఆత్మహత్య కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని స్వప్న అనుమానం వ్యక్తం చేశారు.