పెళ్లికి పెద్దలు అంగీకరించరని మనస్తాపం.. ప్రేమజంట ఆత్మహత్య

20-10-2020 Tue 10:13
  • నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలంలో ఘటన
  • ప్రియురాలితో కలిసి వెళ్లి అటవీ ప్రాంతంలో ఆత్మహత్య
  • ఆత్మహత్యకు ముందు స్నేహితుడికి ఫోన్ చేసిన యువకుడు
Lovers hanged to death them self in nagarkurnool dist

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. నాగర్‌కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో జరిగిందీ ఘటన. మండలంలోని బిల్లకల్లుకు చెందిన అఖిల (19), చెంచుగూడేనికి చెందిన నిమ్మల అనిల్ (20) ప్రేమికులు. వీరు ప్రేమలో ఉన్న విషయం ఇటీవల యువతి తల్లికి తెలియడంతో కుమార్తెను ఆమె మందలించింది. తమ ప్రేమ గురించి ఇంట్లో తెలిసిన విషయాన్ని అఖిల తన ప్రియుడు అనిల్‌కు చెప్పింది.

ఆదివారం రాత్రి బిల్లకల్లు వచ్చిన అనిల్ ప్రియురాలిని కలిసి ఆమెను తీసుకెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున దాదాపు 5 గంటల సమయంలో స్నేహితుడికి ఫోన్ చేసిన అనిల్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారు పడిన అతడు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి అటవీ ప్రాంతంలో గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

నిన్న రుషులచెరువు అటవీ శాఖ బేస్ క్యాంపు వద్ద చెట్టుకు వేలాడుతున్న అఖిల, అనిల్ మృతదేహాలను చూసిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.