తేజస్వినిని హత్య చేయడానికి ముందు స్నేహితుడికి ఫోను చేసి రమ్మని పిలిచిన నాగేంద్రబాబు

20-10-2020 Tue 10:12
  • విజయవాడలో ఇటీవల ప్రియుడి చేతిలో హత్యకు గురైన తేజస్విని
  • హత్య జరగగానే తేజస్విని ఇంటికి నిందితుడు నాగేంద్ర స్నేహితుడు
  • అప్పటికే తేజస్వినిని ఆసుపత్రికి తరలిస్తోన్న ఆమె కుటుంబసభ్యులు
nagendra calls his friend police find in tejaswini case

విజయవాడలో ఇటీవల ప్రియుడి చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్విని కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పోలీసులు అనేక విషయాలను గుర్తించారు. నిందితుడు నాగేంద్రబాబు ముందస్తు ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబు కాల్‌డేటాను పోలీసులు పరిశీలించగా పలు విషయాలు తెలిశాయి.

తేజస్వినిని హత్య చేయడానికి ముందు తన స్నేహితుడికి నాగేంద్ర బాబు ఫోన్‌ చేసినట్లు పోలీసులు తేల్చారు. నాగేంద్రబాబు స్నేహితుడిని కూడా పోలీసులు  విచారించి, కీలక విషయాలు తెలుసుకున్నట్టు సమాచారం. తనకు నాగేంద్ర ఫోన్‌ చేసి.. కాసేపటిలో దివ్య తేజస్విని ఇంటి దగ్గరకు రావాలని తనను కోరినట్టు అతడు పోలీసులకు తెలిపాడు.

తాను తేజస్విని ఇంటికి వచ్చే సమయానికే తేజస్వినిని ఆసుపత్రికి తరలించేందుకు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. తాను లోపలికి వెళ్లి చూస్తే నాగేంద్ర బాబు రక్తపు మడుగులో ఉన్నాడని చెప్పాడు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు మళ్లీ విచారిస్తున్నారు. నిన్న మరోసారి తేజస్విని కుటుంబ సభ్యులతో పాటు, ఆమె ఇంటి చుట్టు పక్కల వారిని కూడా విచారించారు.