Andhra Pradesh: వర్షాల ఎఫెక్ట్.. బెంబేలెత్తిస్తున్న ఉల్లిధర

  • భారీ వర్షాల కారణంగా తగ్గిన ఉల్లి దిగుబడి
  • మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి
  • రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై అందించాలని నిర్ణయం
Onion price in AP reached to Rs 70 in retail market

ఉల్లిధర మరోమారు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. భారీ వర్షాల కారణంగా దిగుబడి ఒక్కసారిగా పడిపోవడంతో రేటు అమాంతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ. 70 పలుకుతుండగా, తెలంగాణలో 100 రూపాయలుగా ఉంది. వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండడంతో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది ఉల్లి నిల్వలు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో మున్ముందు రూ. 100 దాటే అవకాశం ఉందని ఏపీ మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తున్నారు. ఉల్లిధర పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతుండడంతో రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

నిజానికి గతేడాదిలానే ఈసారి కూడా 40 వేల హెక్టార్లలో ఉల్లి పంటను రైతులు సాగు చేసినప్పటికీ వర్షాల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో కొరత ఏర్పడింది. దీంతో ఇక్కడి ప్రజల అవసరాలు తీర్చేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఫలితంగా రేట్లు కొండెక్కాయి.

దీంతో, రాయితీపై ప్రజలకు అతి తక్కువ ధరకు అందించాలని మార్కెటింగ్ శాఖ యోచిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్. ప్రద్యుమ్న తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో చర్చించిన అనంతరం ధరను నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

More Telugu News