Telangana: మహబూబాబాద్‌లో వీడియో జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షల డిమాండ్

  • బైక్‌పై వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తమకు తెలుసంటూ ఫోన్
  • జ్వరం వస్తే మందులు కూడా వేశామన్న కిడ్నాపర్లు
  • మళ్లీ ఫోన్ రాకపోవడంతో ఆందోళనలో తల్లిదండ్రులు
video journalist son kidnapped in mahabubabad

తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన ఓ టీవీ చానల్ వీడియో జర్నలిస్టు కుమారుడిని కిడ్నాప్ చేసిన దుండగులు 45 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కిడ్నాపర్ల కోసం పోలీసులు వేటాడుతున్నారు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటిబయట ఆడుకుంటున్న దీక్షిత్ (9)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు.

కుమారుడి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్‌పై వచ్చిన నిందితులు చిన్నారిని పిలవడంతో అతడు వారి వద్దకు వెళ్లి బైక్ ఎక్కాడని, తర్వాత స్నేహితులకు బై కూడా చెప్పాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ఆదివారం రాత్రి 9.40 గంటల సమయంలో బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. బాబు క్షేమంగా ఉండాలంటే రూ. 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులతో రెడీగా ఉండాలని, ఎక్కడికి రావాలో తిరిగి రేపు ఉదయం ఫోన్ చేసి చెబుతామని చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో భయపడిన దీక్షిత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 50 మంది పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.

బాలుడిని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు కాలనీలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, కిడ్నాపర్లు తెలివిగా ఇంటర్నెట్ ద్వారా వివిధ నంబర్ల నుంచి ఫోన్ చేస్తుండడంతో వారు ఎక్కడున్నారో కనిపెట్టడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు ఆరుసార్లు ఫోన్ చేసిన కిడ్నాపర్లు.. బాబు తమ వద్ద క్షేమంగా ఉన్నాడని, జ్వరం వస్తే మందులు కూడా వేసినట్టు చెప్పారు.

అంతేకాదు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం కూడా తమకు తెలుసని, మర్యాదగా అడిగిన మొత్తం ఇస్తే బాలుడిని విడిచిపెడతామని హెచ్చరించారు. అయితే, ఆ తర్వాతి నుంచి ఫోన్ రాకపోవడంతో బాధిత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అడిగిన మొత్తం ఇస్తామని, దీక్షిత్‌ను విడిచిపెట్టాలని వేడుకుంటున్నారు.

More Telugu News