Sharukh Khan: 'డీడీఎల్'కి అరుదైన గౌరవం.. లండన్ లో షారుఖ్, కాజోల్ కాంస్య విగ్రహం!

  • 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే'కి పాతికేళ్లు
  • షారుఖ్, కాజోల్ జోడీకి విపరీతమైన ఇమేజ్
  • మరాఠా మందిర్ లో 20 ఏళ్లకు పైగా ప్రదర్శన
  • 'సీన్స్ ఇన్ ద స్క్వేర్'లో కాంస్య విగ్రహం ఏర్పాటు
DDL gets rare honour

ప్రతి భాషలోనూ అప్పుడప్పుడు క్లాసిక్ అనదగ్గ సినిమాలు ఒకటీ అరా వస్తుంటాయి. అవి ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రను వేస్తాయి. కాలంతో సంబంధం లేకుండా అవి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అలాంటి కల్ట్ క్లాసిక్ గా హిందీ సినిమా 'డీడీఎల్'.. అదే 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రాన్ని కూడా చెప్పుకోవచ్చు.

షారుఖ్ ఖాన్, కాజోల్ హీరో హీరోయిన్లుగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రూపొంది, 1995 అక్టోబర్ 20న విడుదలైన 'డీడీఎల్' అద్భుతమైన ప్రేమకావ్యంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద నిలిచిపోయింది. ఆ రోజుల్లో ఆ చిత్రాన్ని చూడని యువత లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈ చిత్రం కుర్రకారుని ఊపేసింది.

ఈ చిత్రంతో షారుఖ్, కాజోల్ ల స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. థియేటర్లో బ్రేక్ అన్నది లేకుండా ఎక్కువ కాలం ప్రదర్శితమైన చిత్రంగా కూడా ఇది రికార్డు సృష్టించింది. ముంబైలోని 'మరాఠా మందిర్' థియేటర్ లో రెండు దశాబ్దాలకు పైగా ప్రదర్శితమైంది.
 
ఇక విషయానికి వస్తే, ఈ చిత్రం విడుదలై ఇప్పుడు 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా షారుఖ్, కాజోల్ జోడీకి అపూర్వ గౌరవం లభించనుంది. ఈ చిత్రంలోని ఒక సన్నివేశానికి సంబంధించి వీరి పాత్రల తాలూకు కాంస్య విగ్రహాన్ని లండన్ లోని 'సీన్స్ ఇన్ ద స్క్వేర్'లో ఏర్పాటు చేయనున్నట్టు హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సినిమాలలోని క్యారెక్టర్స్ కు సంబంధించిన కాంస్య విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేస్తూ వుంటారు.

More Telugu News