కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం జగన్

19-10-2020 Mon 20:58
  • ఇటీవల తీవ్ర వాయుగుండం కారణంగా వర్షాలు 
  • సీఎం జగన్ ఏరియల్ సర్వే
  • వరద పరిస్థితులు సీఎంకు వివరించిన అధికారులు
CM Jagan conducts aerial survey in flood hit areas

భారీ వర్షాలతో కుదేలైన కృష్ణా, గోదావరి జిల్లాలను ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్ లో ఆయనతో పాటు మంత్రులు మేకతోటి సుచరిత, కొడాలి నాని కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఏరియల్ సర్వే చేస్తున్న సమయంలో అధికారులు సీఎం జగన్ కు వరద పరిస్థితులను వివరించారు.

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు కడగండ్లు మిగిల్చింది. అనేక ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించడంతో పంటలు నీట మునిగాయి. రైతాంగం భారీగా నష్టపోయింది. లంక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.