కమల్ నాథ్ వ్యాఖ్యలపై సోనియా, రాహుల్ స్పందించరేం?: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం

19-10-2020 Mon 20:22
  • మధ్యప్రదేశ్ మహిళా మంత్రి ఇమార్తిని ఐటమ్ అన్న కమల్ నాథ్
  • కాంగ్రెస్ కు విలువల్లేవన్న స్మృతి ఇరానీ
  • కమల్ నాథ్ కూడా దిగ్విజయ్ అడుగుజాడల్లో నడుస్తున్నాడని విమర్శలు
Union minister Smriti Irani fires on Kamal Nath

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఓ మహిళా మంత్రిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ లో దబ్రా అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి ఇమార్తి దేవి బరిలో ఉన్నారు. ఆమెను ఉద్దేశించి కమల్ నాథ్ "ఏం ఐటమ్ అబ్బా!" అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం పట్ల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమల్ నాథ్ వ్యాఖ్యలను ఖండించిన స్మృతి... ఇప్పటికీ కాంగ్రెస్ అధినాయకత్వం స్పందిచడంలేదని మండిపడ్డారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అన్నారు. ఓ మహిళా రాజకీయనేతను 'ఐటమ్' అని పిలవడం ద్వారా కమల్ నాథ్ కూడా దిగ్విజయ్ సింగ్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని విమర్శించారు. 'ఐటమ్' అంటూ వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ లో ఎలాంటి విలువలు ఉన్నాయో అర్థమవుతోందని తెలిపారు. గతంలో దిగ్విజయ్ ఓ మహిళా రాజకీయవేత్తను కూడా 'కత్తిలాంటి సరుకు' అని వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ అధినాయకత్వం మిన్నకుండిపోయిందని ఆరోపించారు.