హత్రాస్ ఘటనలో కొత్త డిమాండ్.. నష్ట పరిహారం చెల్లించాలంటున్న పొలం యజమాని!

19-10-2020 Mon 20:06
  • రేప్ జరిగిన పొలంలో క్రైమ్ సీన్ ను పరిశీలించిన సీబీఐ
  • పొలానికి నీరు పెట్టొద్దని, పంటను కోయొద్దని రైతుకు అధికారుల ఆదేశం
  • పంట మొత్తం నాశనమైందని రైతు కంటతడి
Twist in Hathras incident

హత్రాస్ సామూహిక అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా... ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

బాధితురాలిని నిందితులు హత్రాస్ లోని ఓ పంట పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన సంగతి విదితమే. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ బృందం పంట పొలంలో క్రైమ్ సీన్ ను పరిశీలించింది. ఈ నేపథ్యంలో సదరు పొలం రైతుకు అధికార యంత్రాంగం కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసు విచారణ నేపథ్యంలో పంటను కోయవద్దని, క్రైమ్ సీన్ లో సాక్ష్యాధారాలను సేకరించేంత వరకు పొలానికి నీరు పెట్టొద్దని ఆదేశించారు.

ఈ నేపథ్యలో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మొత్తం నాశనమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టుబడి నిమిత్తం రూ. 1.6 లక్షలు అప్పు చేశానని... ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదని అన్నారు. తనకు రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ పొలాన్ని నమ్ముకునే ఐదుగురు కుటుంబ సభ్యులతో కూడిన తమ కుటుంబం బతుకుతోందని చెప్పాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని 24 ఏళ్ల సదరు రైతు కంటతడి పెడుతున్నాడు.