KCR: హైదరాబాద్ లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం: సీఎం కేసీఆర్

  • హైదరాబాద్ ను అతలాకుతలం చేసిన వరదలు
  • సీఎం కేసీఆర్ సమీక్ష
  • పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు రూ.1 లక్ష చొప్పున సాయం
  • సీఎం సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి
CM KCR reviews flood situation in Hyderabad city

హైదరాబాదులో కుండపోత వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారని తెలిపారు. వందేళ్లలో ఎన్నడూలేనంత భారీ వర్షం కురిసిందని అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. హైదరాబాదులో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఇల్లు పూర్తిగా కూలిపోతే రూ.1 లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు ఇస్తామని వివరించారు. రేపు ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. పేదలకు సాయం అందించేందుకు మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం రీలీఫ్ ఫండ్ కు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు.

More Telugu News