Chris Gayle: సూపర్ ఓవర్ కు ముందు నా కోపానికి కారణం ఇదే: క్రిస్ గేల్

  • బ్యాటింగ్ కు వెళుతూ కోపంగా కనిపించిన గేల్
  • గెలవాల్సిన మ్యాచ్ లో పరిస్థితిని దారుణం చేసుకున్నాం
  • అందుకే అసహనంగా ఉన్నానన్న గేల్
Chris Gayle Tell The Reason for Angry Before Super Over

నిన్న ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఐపీఎల్ 2020లో భాగంగా జరిగిన మ్యాచ్ లో విజయం రెండు జట్ల మధ్యా దోబూచులాడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండు సూపర్ ఓవర్ల వరకూ సాగగా, క్రిస్ గేల్, మయాంక్ లు చివర్లో మెరుపులు మెరిపించి, తమ జట్టుకు విజయాన్ని అందించారు. రెండో సూపర్ ఓవర్ కు ముందు బ్యాట్ తీసుకున్న క్రిస్ గేల్, చాలా అసహనంగా, కోపంగా కనిపించాడు.

ఆ క్షణాల్లో తన కోపానికి కారణం ఏంటన్న విషయాన్ని గేల్ స్వయంగా వివరించాడు. తాను సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒత్తిడికి లోను కాలేదు కానీ, కోపంగా ఉన్నానని చెప్పిన గేల్, ఎంతో సులువుగా గెలవాల్సిన మ్యాచ్ లో, అటువంటి పరిస్థితి రావడాన్ని చూసి తట్టుకోలేక, ఆందోళన చెందానని చెప్పాడు. కానీ, క్రికెట్ లో ఇటువంటి పరిస్థితులు అసాధారణంగా జరుగుతుంటాయని అన్నాడు.

ఈ మ్యాచ్ లో షమీ నిజమైన హీరో అని వ్యాఖ్యానించిన గేల్, ఆరు పరుగుల టార్గెట్ ను కాపాడుకోవడం ఎంతో కష్టమని, అది కూడా రోహిత్ శర్మ, డికాక్ వంటి వరల్డ్ క్లాన్ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం చాలా క్లిష్టతరమని, కానీ, షమీ అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడని కితాబిచ్చాడు. అద్భుతమైన యార్కర్లు సంధించి, మ్యాచ్ ని మరో సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లిన క్రెడిట్ పూర్తిగా షమీదేనని, షమీని తాను నెట్స్ లో ఎదుర్కొన్నానని, అతను అద్భుతమైన బౌలర్ అని వ్యాఖ్యానించాడు.

కాగా, ఈ మ్యాచ్ రెండో సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 12 పరుగులు చేయగా, ఆపై వచ్చిన గేల్, తొలి బంతినే సిక్స్ గా మలిచి, తమ జట్టుపై ఉన్న ఒత్తిడిని తొలగించగా, మిగిలిన లాంఛనాన్ని మయాంక్ రెండు వరుస బౌండరీలతో పూర్తిచేశాడు.

More Telugu News