Devineni Uma: దీని వెనుక ఉన్న మీ దోపిడీ, చీకటి ఒప్పందాలను బయటపెట్టండి: దేవినేని ఉమ

devineni uma slams jagan
  • పాడి రైతులకు ఇస్తామన్న బోనస్ ఎగ్గొట్టారు
  • వారి ఆస్తులని బయటి రాష్ట్ర 'అమూల్' సంస్థకు కట్టబెట్టారు
  • మా పార్టీ హయాంలో తెచ్చిన చట్టాలను పక్కనబెట్టారు
పాడి రైతులకు ఏపీ సర్కారు అన్యాయం చేస్తోందంటూ  టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందేనని ఆయన నిలదీశారు.

‘పాడి రైతులకు ఇస్తామన్న బోనస్ ఎగ్గొట్టారు, పాడిరైతుల ప్రయోజనాలను కాపాడటానికి తెలుగు దేశం పార్టీ హయాంలో తెచ్చిన చట్టాలను పక్కనబెట్టారు. వేలకోట్ల రూపాయల విలువ చేసే పాడి రైతుల, సహకార సంఘాల ఆస్తులని బయటి రాష్ట్ర "అమూల్" సంస్థకు బలవంతంగా కట్టబెట్టారు. దీని వెనుక ఉన్న మీ దోపిడీ, చీకటి ఒప్పందాలను బయటపెట్టండి వైఎస్ జగన్’ అని దేవినేని ఉమ నిలదీశారు.

కాగా, ఏపీలో పాల సేకరణలోనూ ప్రభుత్వ జోక్యానికి రంగం సిద్ధమైందని, ఏపీలో ఉత్పత్తయ్యే పాలలో అధికశాతం ‘అమూల్‌’కు ధారాదత్తం చేయడానికి ఏపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేర్కొన్నారు. ఏపీలో 13 సహకార, 7 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయని, రాష్ట్రంలో ఇన్ని ఉంటే వాటిని వదిలేసి గుజరాత్‌కు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అందులో పేర్కొన్నారు.

విజయ బ్రాండ్‌ పేరుతో వీటిలో సేకరించిన పాలను అమూల్‌కు ధారపోసేందుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతోందని, దీంతో సహకార రంగంలో నడుస్తున్న డెయిరీలు నిర్వీర్యం కావడంతో పాటు ప్రైవేటు డెయిరీల మనుగడకూ ప్రమాదం వాటిల్లుతుందని అందులో రాసుకొచ్చారు.
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News