భారత్ లో కరోనా పీక్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది: కేంద్ర కమిటీ

18-10-2020 Sun 22:08
Centre appointed committee says India saw its peak stage in mid September
  • సెప్టెంబరు మధ్యలోనే కరోనా పతాకస్థాయికి చేరిందని వెల్లడి
  • లాక్ డౌన్ విధించకపోతే జూన్ లోనే పీక్స్ కి వెళ్లేదని వివరణ
  • వచ్చే ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా తగ్గిపోతుందన్న కమిటీ

చైనాలోని వుహాన్ లో జన్మించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. అయితే ఈ వైరస్ పీక్ స్టేజికి వెళ్లిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర కరోనా కమిటీ స్పందిస్తూ, భారత్ లో కరోనా పీక్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయిందని వివరించింది. ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ నేతృత్వంలోని ఈ కమిటీ కరోనా కట్టడిలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించే క్రమంలో కేంద్రానికి తోడ్పాటు అందించనుంది.

ఈ క్రమంలో ఆ కమిటీ దేశవ్యాప్త అధ్యయనం నిర్వహించింది. అధ్యయనంలో భాగంగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో నివేదిక వివరాలు పంచుకుంది. సెప్టెంబరు మాసం మధ్యలో భారత్ లో కరోనా పతాకస్థాయికి చేరుకుందని, ఇప్పుడు పాటిస్తున్న మార్గదర్శకాలను కొనసాగిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా కేసుల సంఖ్య అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

భారత్ లో ఒకవేళ లాక్ డౌన్ విధించకపోయి ఉంటే జూన్ మాసంలోనే కరోనా పీక్ స్టేజ్ కి వెళ్లేదని, 15 రెట్లు అధికంగా కేసులు వచ్చి ఉండేవని ఆ నివేదికలో వివరించారు. మార్చిలోనే లాక్ డౌన్ విధించడం ద్వారా పీక్ స్టేజ్ ను సెప్టెంబరుకు మార్చగలిగామని కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ విద్యాసాగర్ తెలిపారు.