ఏపీ కరోనా అప్ డేట్: 3,986 పాజిటివ్ కేసులు, 23 మరణాలు

18-10-2020 Sun 18:53
AP State corona statistics released in a bulletin
  • కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55 కేసులు
  • తాజాగా 4,591 మందికి కరోనా నయం
  • 36,474కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఏపీలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 3,986 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 55 కేసులు మాత్రమే వచ్చాయి. ఏపీలో కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో కర్నూలు జిల్లాలో విస్తృతస్థాయిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పుడు తక్కువ కేసులతో గణనీయంగా కోలుకున్నట్టు అర్థమవుతోంది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 528 కేసులు గుర్తించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 23 మంది మృతి చెందారు. తాజాగా 4,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఓవరాల్ గణాంకాలు చూస్తే... ఇప్పటివరకు ఏపీలో 7,83,132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,40,229 మంది కోలుకోగా, ఇంకా 36,474 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,429కి చేరింది.