విజయవాడ బీటెక్ విద్యార్థిని కేసులో వీడని మిస్టరీ!

18-10-2020 Sun 17:22
Divya Tejaswini case becomes a puzzle to police
  • సంక్లిష్టంగా మారిన దివ్య తేజస్విని ఉదంతం
  • నాగేంద్రబాబుపైనే ఆరోపణలు చేస్తున్న దివ్య తల్లిదండ్రులు
  • ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం అంటున్న నాగేంద్రబాబు

ఇటీవల విజయవాడలో దివ్య తేజస్విని అనే బీటెక్ విద్యార్థిని దారుణరీతిలో విగతజీవిగా కనిపించడం తెలిసిందే. నాగేంద్రబాబు అనే పెయింటర్ ఆమెను హత్య చేసినట్టు దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్రబాబు మాత్రం తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, దివ్య తల్లిదండ్రుల నుంచి వేధింపులు వస్తుండడంతో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని భావించామని తెలిపాడు. దివ్య తేజస్విని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, తాను స్పృహకోల్పోయానని వెల్లడించాడు.

అయితే, ఇటీవల పోలీసులకు దివ్య తేజస్వినికి సంబంధించిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో లభ్యమైంది. అందులో నాగేంద్రబాబు తనను వేధిస్తున్న వైనంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అటు నాగేంద్రబాబు చెబుతున్నదానికి, ఇటు వీడియోలో దివ్య తేజస్విని చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఈ కేసు సంక్లిష్టంగా మారింది.

దాంతో, ఈ ఘటన జరిగిన సమయంలో నాగేంద్రబాబు సన్నిహితులెవరైనా సంఘటన స్థలంలో ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అంతేకాదు, దివ్య తేజస్విని ఫ్రెండ్స్, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్ల ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.