మరో రెండు హృదయాల చేరికతో మా కుటుంబం మరింత విస్తృతమైంది: నమ్రతా శిరోద్కర్

18-10-2020 Sun 16:18
Namrata Shirodkar says their family has extended with two more hearts
  • మహేశ్ బాబు సామాజిక కార్యక్రమాలు
  • చేయూతగా నిలుస్తున్న నమ్రతా శిరోద్కర్
  • ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హృద్రోగ చికిత్సలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి అనేక సామాజిక కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు. ఇప్పటికే వారు విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో వందల సంఖ్యలో హృద్రోగ బాధిత చిన్నారులకు కొత్తజీవితం ఇచ్చారు. ఆ చిన్నారులకు ఖరీదైన శస్త్రచికిత్సలు చేయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ క్రమంలో నమ్రతా శిరోద్కర్ ఆసక్తికర పోస్టు చేశారు. మరో రెండు హృదయాల చేరికతో తమ కుటుంబం మరింత విస్తృతమైందని తెలిపారు.

ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్దరు చిన్నారులు కోలుకున్నారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. ఆ చిన్నారులను వైద్యులు డిశ్చార్జి చేశారని నమ్రత వెల్లడించారు. కష్టకాలంలోనూ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఆ చిన్నారులు మరింత ఆరోగ్యంగా జీవించాలని, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు నమ్రత వివరించారు. అంతేకాదు, ఎంబీ ఫర్ సేవింగ్ హార్ట్స్ (#MBforSavingHearts) అంటూ మహేశ్ బాబు సహృదయతను ఉద్దేశించి హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.