హైదరాబాద్ వ్యాప్తంగా రోడ్లన్నీ జలమయం.. వీడియోలు, ఫొటోలు ఇవిగో

18-10-2020 Sun 11:26
rain in hyderabad
  • హైదరాబాద్‌ను మరోసారి ముంచెత్తిన భారీ వర్షాలు 
  • ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్‌
  • వాహనాదారులకు తీవ్ర అవస్థలు

హైదరాబాద్‌ను భారీ వర్షాలు మరోసారి ముంచెత్తడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలను వరద ముంచెత్తుతోంది. భారీ వరదతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించి పోవడంతో వాహనాదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీ పరిధిలోని అల్‌జుబెర్‌ కాలనీ, బాబానగర్‌లో గుర్రం చెరువు కట్ట తెగి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

ఉప్పుగూడ, సాయిబాబా నగర్‌, శివాజీనగర్‌, బాబా నగర్‌ బస్తీలు జలమయం అయ్యాయి. మలక్ పేటలో మరోసారి రోడ్డు జలమయమైంది. మంగళ్‌హాట్‌ పరిధిలోని ఆర్‌కే పేట్‌లో వర్షానికి గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి చెందింది. మరోవైపు, కాచిగూడ, నల్లకుంట, తార్నాక, ఎర్రగడ్డ, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లో వర్షపు నీరు రోడ్లపై చేరింది. మల్కాజ్ గిరి, నాచారం, అంబర్ పేట  ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.  

మాదాపూర్, నానక్ రాంగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. ఎల్బీనగర్‌ పరిధిలోని కాలనీల్లోకి భారీగా వరద చేరింది. ప్రశాంతినగర్‌, గాంధీనగర్‌ సహా పలుకాలనీలతో పాటు ఆర్కేపురం డివిజన్‌లోని ఎన్టీఆర్‌నగర్‌ లోని వీధులు చెరువులను తలపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి వరద ప్రవాహం ఉంది.