సీఎం అభ్యర్థి మా అంతర్గత వ్యవహారం.. మేము బీజేపీకి  బానిసలం కాదు: అన్నాడీఎంకే

18-10-2020 Sun 11:20
We are not slave to BJP says AIADMK leader
  • కేంద్రంతో సఖ్యతతో ఉండటం బానిసత్వం కాదు
  • నిధుల కోసమే కేంద్రంతో సఖ్యతతో ఉంటాం
  • పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని అంగీకరించే పార్టీలతోనే పొత్తు

తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ నియంత్రిస్తోందనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అన్నాడీఎంకే పాలన బీజేపీ కనుసన్నల్లోనే సాగుతోందని కూడా కొందరు చెపుతుంటారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అభ్యర్థిత్వం పట్ల బీజేపీ అసంతృప్తిగా ఉందనే కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ అన్వర్ రాజా మాట్లాడుతూ, సీఎం అభ్యర్థి ఎంపిక తమ అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఇందులో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం లేదని అన్నారు. బీజేపీకి అన్నాడీఎంకే బానిస కాదని చెప్పారు. కేంద్రంతో సఖ్యంగా ఉన్నంత మాత్రాన అది బానిసత్వం కాదని అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను పొందేందుకే కేంద్రంతో తాము క్లోజ్ గా ఉంటామని చెప్పారు. పళనిస్వామి అభ్యర్థిత్వాన్ని అంగీకరించే పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకుంటామని తెలిపారు.