యూపీలో బెలూన్ కలకలం.. గ్రహాంతరవాసి అని భయపడ్డ జనం!

18-10-2020 Sun 10:07
Iron Man Balloon Triggers Panic In UP Town
  • ఐరన్ మ్యాన్ బెలూన్ ను ఎవరో ఎగరేసిన వైనం
  • ఓ గ్రామం సమీపంలో పడ్డ బెలూన్
  • దాని ఆకారాన్ని చూసి ఏలియన్ అని భావించిన జనాలు

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని దంకౌర్ గ్రామ ప్రజలు ఒక బెలూన్ చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కామిక్ క్యారెక్టర్ అయిన ఐరన్ మ్యాన్ ని పోలి ఉన్న ఓ బెలూన్ ని చూసి స్థానికులు గ్రహాంతరవాసిగా భావించారు. ఈ బెలూన్ ని గ్యాస్ తో నింపి ఎవరో ఎగరేశారు. ఐరన్ మ్యాన్ స్ట్రక్చర్ తో అది ఒక రోబోలా కనిపించింది.

నిన్న ఉదయం అది గాల్లో ఎగురుతూ గ్రామ సమీపంలోని కెనాల్ వద్ద పడింది. చెట్టు పొదలకు ఆనుకుని ఉన్న ఆ బెలూన్ కి చెందిన కొంత భాగం నీటిని తాకుతూ కొద్దిగా ఊగసాగింది. అక్కడకు చేరుకున్న ప్రజలు కాస్త దూరం నుంచి దాన్ని చూస్తూ... దాన్ని ఒక ఏలియన్ గా భావించి, భయపడ్డారు. అది ఊగుతుండటంతో దాన్ని జీవిగానే భావించారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, దాని ఆకారాన్ని చూసి జనాలు భయపడ్డారని చెప్పారు. ఈ బెలూన్ ను ఎవరు ఎగరేశారనే విషయం ఇంకా తెలియలేదని అన్నారు.