Hackers: యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కు కూడా నకిలీ రూపొందించి యూజర్లను బోల్తాకొట్టిస్తున్న చైనా హ్యాకర్లు

  • నకిలీ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తో రెచ్చిపోతున్న హ్యాకర్లు
  • నిజమైనదే అని భ్రమింపజేసేలా నకిలీ సాఫ్ట్ వేర్
  • అప్రమత్తం చేసిన గూగుల్
Hackers tricks users to download fake anti virus software

చైనా ప్రభుత్వంతో సంబంధమున్న కొందరు హ్యాకర్లు యూజర్లను బోల్తాకొట్టించేందుకు ఏంచేస్తున్నారో చూడండి! సాధారణంగా కంప్యూటర్లకు వైరస్ లు, మాల్వేర్లను ప్రబల శత్రువులుగా భావిస్తుంటారు. వాటిని ఎదుర్కొనేందుకు యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లను ఉపయోగిస్తుటారు. అయితే చైనా హ్యాకర్లు ఈ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లకు నకిలీలు రూపొందించి, వాటిని యూజర్లు డౌన్ లోడ్ చేసుకునేలా భ్రమింపజేస్తున్నారు.

ముఖ్యంగా, ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ మెకాఫీకి చైనా హ్యాకర్లు నకిలీ రూపొందించారని, ఆ నకిలీ సాఫ్ట్ వేర్ నిజమైనదేనని నమ్మిన యూజర్లు దాన్ని డౌన్ లోడ్ చేసుకునే ముప్పు పొంచి ఉందని గూగుల్ వెల్లడించింది. దీనిపై గూగుల్ విపత్తుల విశ్లేషణ సమూహం అధిపతి షేన్ హంట్లీ ఓ బ్లాగ్ పోస్టులో వివరించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో హ్యాకర్లు ఈ తరహా దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ నకిలీ యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ ను గిట్ హబ్, డ్రాప్ బాక్స్ వంటి ఆన్ లైన్ సేవల వేదికల ద్వారా వ్యాప్తి చేస్తున్నారని వివరించారు. ఈ విషయమై ఇప్పటికే అమెరికా ప్రభుత్వ నిఘా వర్గాలు హెచ్చరించాయని హంట్లీ తెలిపారు.

More Telugu News