కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ప్రమాదం అంటూ కథనాలు... ఏం జరిగిందో చెప్పిన కేంద్ర న్యాయశాఖ

17-10-2020 Sat 21:53
Union Law ministry clarifies Ravi Shankar Prasad is safe
  • హెలికాప్టర్ ప్రమాదానికి గురైందంటూ కథనాలు
  • బ్లేడ్లు విరిగిపోయినట్టు వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ
  • అప్పటికే రవిశంకర్ ప్రసాద్ హెలికాప్టర్ దిగిపోయారని స్పష్టీకరణ

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం వివరణ ఇచ్చింది. కేంద్రమంత్రి రవిశంకర్ పై వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. ఆయన సురక్షితంగా ఉన్నారని, ఆయనకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపింది.

పాట్నా ఎయిర్ పోర్టులో ఆయన హెలికాప్టర్ నుంచి దిగి వెళ్లిన తర్వాత కొద్దిమేర డ్యామేజి జరిగిందని, హెలికాప్టర్ కు ఉండే రోటార్ బ్లేడ్లు విరిగిపోయాయని వెల్లడించింది. పాట్నా ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ నిర్మాణం వద్ద వైర్లను తాకడంతో ఆ బ్లేడ్లు విరిగినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ బ్లేడ్లు విరిగిపోయిన సమయంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సహా ఇతరులు హెలికాప్టర్ నుంచి దిగిపోయారని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం స్పష్టీకరించింది.

దీనిపై రవిశంకర్ ప్రసాద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, జంజర్ పూర్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో హెలికాప్టర్ రోటార్ బ్లేడ్లు విరిగిపోయాయని, అప్పటికే తాను హెలికాప్టర్ నుంచి దిగి వచ్చేశానని వివరణ ఇచ్చారు. తాను క్షేమంగా ఉన్నానని వెల్లడించారు.