ఇంతకీ చిరంజీవి సినిమాలో ఛాన్స్ ఎవరికో!

17-10-2020 Sat 21:37
  • చిరంజీవి హీరోగా రెండు రీమేక్ చిత్రాలు 
  • 'వేదాళం'కి మెహర్ రమేశ్ దర్శకత్వం  
  • సినిమాలో కీలకమైన చెల్లెలి పాత్ర
  • సాయిపల్లవి, కీర్తి సురేశ్ లలో ఒకరికి ఛాన్స్  
Who will get chance in Chiranjivi film
ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత రెండు సినిమాలు చేయనున్నారు. ఈ రెండూ కూడా రీమేక్ లే కావడం ఇక్కడ విశేషం. వీటిలో ఒకటి తమిళ సినిమా 'వేదాళం' కాగా, మరొకటి మలయాళ సినిమా 'లూసిఫర్'. ఈ రెండింటికీ సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఇక వీటిలో 'వేదాళం' రీమేక్ కి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా, 'లూసిఫర్' రీమేక్ కి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఆయా సినిమాలకు ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోంది. ఈ క్రమంలో 'వేదాళంలో' కీలకమైన చిరంజీవి సోదరి పాత్ర ఒకటి వుంది.

ఈ పాత్ర అభినయానికి ఆస్కారం వున్న పాత్ర కావడం.. హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ వున్న నటి అవసరం వున్న నేపథ్యంలో ఇద్దర్ని పరిశీలిస్తున్నారు. ఇందుకోసం సాయిపల్లవి, కీర్తి సురేశ్ లను పరిశీలనలోకి తీసుకున్నారని తాజా సమాచారం. వీరిద్దరిలో ఒకరిని కచ్చితంగా ఎంపిక చేస్తారని అంటున్నారు. మరి చిరంజీవి చెల్లెగా నటించే ఆ అవకాశం ఎవరికి వస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో చిరంజీవి గెటప్ సరికొత్తగా ఉంటుందని అంటున్నారు. ఇందులో ఆయన నున్నని గుండుతో కనిపిస్తారట. అందుకోసమే ఇటీవల తాను గుండుతో వున్న గెటప్ లో మేకప్ టెస్ట్ కూడా చేయించుకుని, ఫొటోలను తీయించుకున్నారు.