నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వెళ్లిన మంత్రి ఈటల

17-10-2020 Sat 20:45
Eatala Rajender and Karne Prabhakar visits Naini Narsimha Reddy
  • నాయిని ఆరోగ్య పరిస్థితి విషమం!
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స 
  • ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న నాయిని
  • న్యూమోనియా కారణంగా క్షీణించిన ఆరోగ్యం

తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి వెళ్లారు. నాయిని ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈటల, కర్నె... నాయినిని పరామర్శించిన అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలను కోరారు.

నాయిని నర్సింహారెడ్డి ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్నారు. అయితే ఆయన న్యూమోనియా బారినపడ్డారు. దాంతో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో నాయిని ఆరోగ్యం క్షీణించింది. నాయిని అర్ధాంగి అహల్యకు కూడా కరోనా సోకినా ఆమె కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేరారు.