తోపులాటలో రేవంత్ రెడ్డి కాలికి గాయం

17-10-2020 Sat 20:38
Revantsh Reddy wounded in rift with police
  • కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
  • ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలింపు
  • పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను పరిశీలించేందుకు ఈరోజు రేవంత్, మల్లు రవి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి తదితరులు వెళ్లారు. ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్న వీరిని తెలకపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రేవంత్ రెడ్డి కాలికి గాయమైంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ప్రభుత్వం అక్రమాలను కప్పిపుచ్చుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.