Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వర్ష సూచన... రాగల నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు

  • పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • కోస్తా, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల శాఖ
Disaster management department issues heavy rain alert for AP

ఇటీవలే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరద పరిస్థితుల నుంచి ఇప్పటికీ అనేక జిల్లాలు కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల నాలుగైదు గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఓ ప్రకటన చేశారు.

కాగా, ఇప్పటికే విజయవాడ, కర్నూలు నగరాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు ఎయిర్ పోర్టుకు వెళ్లే రహదారి పూర్తిగా జలమయమైంది. ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలు సాగించాలని నగర డీసీపీ విజ్ఞప్తి చేశారు.

More Telugu News