డల్లాస్ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు.. చివరకు వెనిస్ లా మారింది: భట్టి విక్రమార్క

17-10-2020 Sat 19:38
Is this global city says Mallu Bhatti Vikramarka
  • కేటీఆర్, కేసీఆర్ లపై భట్టి విక్రమార్క ఫైర్
  • రూ. 72 వేల కోట్ల అభివృద్ధి ఎటు పోయిందని ప్రశ్న
  • ఇరిగేషన్ శాఖను నాశనం చేశారు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. హైదరాబాదును డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని... వర్షాలకు వెనిస్ నగరంలా మారిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ విశ్వనగరమని మంత్రి కేటీఆర్ అన్నారని... ఇదేనా విశ్వనగరం అంటే? అని ప్రశ్నించారు. నగరంలో రూ. 72 వేల కోట్ల అభివృద్ది ఎటు పోయిందని అడిగారు.

కల్వకుర్తి ప్రాజెక్టు పంపు హౌస్ మునకకు ప్రభుత్వం చెపుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని విక్రమార్క మండిపడ్డారు. పంప్ హౌస్ మునకకు గత ప్రభుత్వాలే కారణమని చెప్పడానికి సిగ్గుండాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంపు హౌస్ నిర్మించవద్దని నిపుణుల కమిటీ చెప్పిందని, అండర్ గ్రౌండ్ బ్లాస్ట్ లతో నష్టం జరుగుతుందని తెలిపిందని... అయినా ప్రభుత్వం వినలేదని అన్నారు. మొత్తం ఇరిగేషన్ శాఖనే నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల వద్దకు ప్రతిపక్షాలను ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు.