హైదరాబాదులో మళ్లీ వాన... నగరజీవికి ఆందోళన!

17-10-2020 Sat 18:57
Once again rain visits Hyderabad city
  • నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
  • ట్రాఫిక్ కు ఇబ్బందులు
  • ఇటీవల కుంభవృష్టితో అతలాకుతలమైన హైదరాబాద్

మొన్నటి కుంభవృష్టి నుంచి ఇంకా కోలుకోని హైదరాబాద్ నగరాన్ని వరుణుడు మరోసారి పలకరించాడు. ఈ సాయంత్రం నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురవడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లక్డీకాపూల్, యూసుఫ్ గూడ, ఖైరతాబాద్ ప్రాంతాలతో పాటు కూకట్ పల్లి, అమీర్ పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బంది ఏర్పడింది.

ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి చేరుకోవాలని ఉద్యోగులు ఆదుర్దా పడుతున్నారు. అయితే వర్షం కారణంగా రహదారులు జలమయం కావడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్నిరోజుల కిందట హైదరాబాద్ లో శతాబ్ద కాలంలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో భారీగా వరదనీరు వచ్చింది. నగర వీధుల్లో పడవలు తిరిగాయంటే పరిస్థితి, వరుణుడి జోరు ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు.