సీఎం జగన్ పై ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలి: ఆలిండియా బార్ అసోసియేషన్

17-10-2020 Sat 18:22
AIBA responds to CM Jagan letter to CJI
  • అక్టోబరు 6న సీజేఐకి లేఖ రాసిన సీఎం జగన్
  • జగన్ లేఖ వెనుక దురుద్దేశాలు ఉన్నాయంటున్న ఏఐబీఏ
  • పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్న ఏఐబీఏ చైర్మన్

ఇటీవల ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేకి లేఖ రాయడంపై ఆలిండియా బార్ అసోసియేషన్ (ఏఐబీఏ) స్పందించింది. జగన్ వైఖరిని బార్ అసోసియేషన్ ఖండించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు అపకీర్తి తెచ్చేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, న్యాయ వ్యవస్థ ధిక్కార నేరం కింద జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.

సుప్రీంకోర్టుకు తదుపరి సీజేఐ రేసులో ముందున్న జస్టిస్ ఎన్వీ రమణపైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపైనా జగన్ వేసిన అపవాదులు, చేసిన దురుద్దేశ పూరిత వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కుదిపేశాయని ఏఐబీఏ చైర్మన్, సీనియర్ న్యాయవాది అదీశ్ సి అగర్వాలా అభిప్రాయపడ్డారు. అక్టోబరు 6న ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బాబ్డేని ఉద్దేశిస్తూ సీఎం జగన్ రాసిన లేఖను అగర్వాలా ఖండించారు.

జగన్ అవినీతి కేసులు, మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారని, అలాంటి వ్యక్తి రాసిన ఈ లేఖ కచ్చితంగా కోర్టులను అడ్డుకునే ప్రయత్నమని స్పష్టం చేశారు. న్యాయమూర్తులను దూషించడం ద్వారా వారిని బెదిరించి తనకు అనుకూలమైన తీర్పులు రాబట్టుకునే చర్య అని ఆరోపించారు. జగన్ ఆ లేఖలో చూపించిన తీవ్రత, ఉద్దేశం, ఆ లేఖ రాసిన సమయం చూస్తుంటే కచ్చితంగా స్వప్రయోజనాలు ఉన్నాయనిపిస్తోందని, ఓ రహస్య అజెండాతో లేఖ రాశారని భావించాల్సి వస్తోందని అగర్వాలా వివరించారు.

జస్టిస్ ఎన్వీ రమణ రాజకీయాల నుంచి నేరపూరిత శక్తులను తొలగించాలన్న పిటిషన్ పై విచారణ చేపట్టిన సమయంలోనే ఈ లేఖ వచ్చిందని అన్నారు. నిర్దిష్ట కేసులను విచారిస్తున్న జడ్జిలను లక్ష్యంగా చేసుకుని ఏపీ సీఎం లేఖ రాయడం ప్రమాదకరమైన చర్య అని, ఏమాత్రం విచక్షణ లేని పని అని అగర్వాలా విమర్శించారు. ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్య విస్తృతిపై తీవ్ర పర్యవసానాలు చూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.